హైదరాబాద్, వెలుగు: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్)కు ఎన్నికల నిర్వహణపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2014 తరువాత పీఏసీఎస్‌లకు చివరిగా ఎప్పుడు ఎన్నికలు నిర్వహించారు? అనంతరం ఎన్నికల నిర్వహణకు చేసిన ప్రయత్నాలు తదితర వివరాలతో అఫిడవిట్‌లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. విచారణను డిసెంబరు 2కు వాయిదా వేసింది.
పీఏసీఎస్‌లకు గతంలో ఉన్న తమను తొలగించి కొత్తవారిని నియమిస్తూ అక్టోబరులో జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ 8 మంది పర్సన్ ఇన్‌చార్జి కమిటీ చైర్మన్‌లు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది డి.ఎల్.పాండు వాదిస్తూ..గతంలో ఉన్న తమను తొలగించి ఏకపక్షంగా మరొకరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరగా న్యాయమూర్తి స్పందిస్తూ.. 2014 రాష్ట్ర విభజన అనంతరం ఎన్నికలు ఎప్పుడు నిర్వహించారు, తరువాత ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. సహకార సంఘ చట్టప్రకారం.. ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోకుండా తాత్కాలికంగా నియమించిన పర్సన్ ఇన్‌చార్జి కమిటీలను కొనసాగించడానికి కారణాలేమిటో చెప్పాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, సహకార సంఘాల శాఖ ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు.
